UPDATEAD 25th JULY 2022 MONDAY 05:30 PM
Flavoured Condoms : కండోమ్.. ఇది దేనికి వాడతారు అనే దాని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. శృంగారంలో పాల్గొన్నప్పుడు అవాంచిత గర్భం రాకుండా, లైంగిక వ్యాధుల సంక్రమించకుండా రక్షణ ఇచ్చేది కండోమ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కండోమ్‌ను శృంగారానికి కాకూండా.. మరో విధంగా కూడా ఉపయోగిస్తున్నారనే విషయం బయటపడింది.
కొంతమంది యువత కండోమ్ కి వ్యసనంగా మారారు. అసలు కండోమ్ ని వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసా.. కిక్కు కోసం. అవును.. నిజమే.. మత్తులో తూగేందుకు కండోమ్ లను వాడుతున్నారు.బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్‌లను తీసేసి ఆ నీటిని తాగుతున్నారు. ఆపై మత్తులో ఊగిపోతున్నారట. ఆ నీరు తాగితే కిక్కు బాగా ఎక్కుతుందంటున్నారు. అచ్చం మందుబాబుల్లా తూలుతున్నారు. కొన్ని రోజులుగా దుర్గాపూర్‌లోని పలు ప్రాంతాల్లో (దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్ నగర్, బెనచిటి, ముచిపర, సి జోన్, ఎ జోన్) ఫ్లేవర్ కండోమ్‌ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
ముఖ్యంగా యువత భారీ మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేశారు. ఒక్కోసారి కొందరు బల్క్ మొత్తంలో కొనుగోలు చేశారట. ఇంత మొత్తంలో ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఓ షాపు యజమానికి అనుమానం వచ్చి తన రెగ్యులర్ కస్టమర్ అయిన ఒక యువకుడిని అడగగా.. మత్తు కోసం కండోమ్‌లు కొంటున్నానని చెప్పాడట.
దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడట. మత్తు కోసం, కిక్కు కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న కొంతమంది యువతకి ఇప్పుడీ కండోమ్ లు ఓ వరంగా మారాయి. ఆల్కాహాల్, గంజాయి, హెరాయిన్ వంటివి ఉన్నా ఇంకా ఏదో కొత్తదనం కోసం యువత పరుగులు పెడుతోంది.
ఈ క్రమంలో కండోమ్ ల వాడకం ద్వారా వారు మత్తు పొందుతున్నారు. కాగా.. కండోమ్‌లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయని, అవి ఆల్కహాల్‌గా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సుగంధ సమ్మేళనం డెండ్రైట్స్ జిగురులో కూడా ఉంటుందని, దానికి అందరూ వ్యసనం అవుతారని అంటున్నారు. వేడి నీటిలో కండోమ్‌లను ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నమై మత్తు వస్తుందని వివరించారు.
దుర్గాపూర్‌లోని చాలా మంది యువకులు కండోమ్ వాటర్ కి బానిసగా మారారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా యువత, కాలేజీ విద్యార్థులు ఈ అలవాటుకు బానిసలుగా మారుతున్నారని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని, ఈ తరహా ప్రయోగానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.







