UPDATED 4th JANUARY 2019 FRIDAY 5:00 PM
గండేపల్లి: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నేటి యువత తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థుల స్వచ్చంధ సేవాదళం గ్రామంలో పర్యటించి స్వచ్ఛభారత్ ర్యాలీ, పోషకాహారం, అగ్నిమాపక, బ్యాంకింగ్, యోగా తదితర అంశాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. కళాశాల డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా గ్రామస్థులకు విద్య, వైద్య, ఆరోగ్యం వంటి వివిధ అంశాల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింగన అరవిందకుమార్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నాగభూషణం, విఆర్వో అప్పలనాయుడు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. రాజశేఖర ఫణీంద్ర, ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్లు అజయ్ కిరీటి, రవి వీరచౌదరి, తదితరులు పాల్గొన్నారు.







