UPDATED 1st NOVEMBER 2022 TUESDAY 8:00 AM
• అడ్డగోలుగా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్
• మార్కెట్ ప్రదేశాల్లో కనిపించని రేట్ల పట్టిక బోర్డులు
• మున్సిపల్ గెజిట్ లో సూచించిన విధంగా కాకుండా అధిక వసూళ్లు
• కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతున్న మున్సిపల్ అధికారులు
• వివరాలు అడిగితే చెప్పేందుకు నిరాకరించిన మున్సిపల్ కమిషనర్
• అధికారుల పాత్రపై కలుగుతున్న అనుమానాలు
• మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి
• స్పందనలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
• ఇటీవల పెద్దాపురం పట్టణానికి సరుకుతో ఇతర జిల్లా నుంచి ఒక లారీ వచ్చింది. ఆ లారీ డ్రైవర్ నుంచి ఆశీల్ వసూలు పేరుతో కాంట్రాక్టర్ రూ. 450 వసూలు చేశాడు.ఇదేమని అడిగితే ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నిజానికి సదరు లారీ డ్రైవర్ నుంచి మున్సిపల్ గెజిట్ ప్రకారం రూ. 60 మాత్రమే వసూలు చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది రెట్లు అధికంగా కాంట్రాక్టర్ వసూలు చేశాడు. దీంతో సదరు డ్రైవర్ లబోదిబోమన్నాడు.
• మెయిన్ రోడ్డులో ఓతోపుడు బండి వ్యాపారి నుంచి ఆశీల్ రూ.7 వసూలు చేయాల్సి ఉండగా అతని వద్ద నుంచి రూ.30 వసూలు వసూలు చేశాడు. దీంతో చిరు వ్యాపారి నిత్యం అధిక ఆశీలు చెల్లించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పట్టణంలో చిరువ్యాపారులపై ఇదే వసూళ్ల దందా కొనసాగుతోంది. అయినా మున్సిపల్ అధికారులకు పట్టదు.
Peddapuram Muncipality : ఎండా, వానా అనే తేడా లేకుండా సైకిళ్లు, తోపుడు బళ్లు, బుట్టలతో రోడ్లపై నిలబడి పండ్లు ఇతర తినుబండారాలు అమ్ముకుని బతికే బడుగు జీవులను పెద్దాపురం మున్సిపాలిటీలో ఆశీల్ వసూలు పేరుతో నిత్యం పిండేస్తున్నారు. దీంతో చిరువ్యాపారులు తమ వ్యాపారాలు సాగించలేక అధికారుల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. ఆశీల్ వసూళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మున్సిపల్ అధికారుల ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడంతో అధికారుల తీరుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆశీల్ కాంట్రాక్టర్ కు మున్సిపల్ అధికారులు సహకరించడంతోనే ఇది సాధ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా సదరు కాంట్రాక్టర్ ఆశీలు వసూలు చేసిన రుసుముకు స్లిప్పులు కూడా ఇవ్వడం లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.
మున్సిపల్ గెజిట్ లో సూచించిన విధంగా కాకుండా..
పట్టణంలో తోపుడు బళ్ల వర్తక సంఘం యూనియన్ లో సుమారు 40 మంది వరకూ వ్యాపారులు ఉన్నారు. అనధికారికంగా మరో 200 వరకూ తోపుడు బళ్లు ఉన్నాయి. అలాగే నిత్యం వందలాదిగా పలు రకాల వాహనాలు పట్టణానికి సరుకు తీసుకువస్తుంటాయి. అయితే మున్సిపల్ గెజిట్ లో సూచించిన విధంగా ఆశీల్ రేట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇక్కడ అవేమీ అమలు జరగవు. రోడ్డు పక్కన వ్యాపారాలు సాగించే చిరు వ్యాపారుల వాహనాల నుంచి మున్సిపల్ అశీల్ పాడుకున్న కాంట్రాక్టర్ ఆశీలు వసూలు చేస్తుంటాడు. అయితే ఆశీలు వసూళ్ల విషయంలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. తోపుడు బండి నుంచి మున్సిపల్ గెజిట్ ప్రకారం రోజుకు రూ. 7, 10, 20 వరకూ వసూలు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ వారి వద్ద నుంచి రూ. 40. రూ.50 వరకూ వసూళ్లు చేస్తున్నాడు. అలాగే ఆటోలు, లారీలు, ట్రక్కులు మొదలయిన వాహనాలకు రూ.40, రూ.50. రూ.60 వసూలు చేయాల్సి ఉండగా రూ.350, రూ.450 వరకూ వసూళ్లు చేస్తుండడంతో ఆశీలు చెల్లించలేక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. పైగా గెజిట్ లో సూచించిన విధంగా రెండు రకాల రంగులతో ముద్రించిన స్లిప్పులను ఉపయోగించాల్సి ఉన్నా ఇక్కడ అమలు జరగడంలేదు. అలాగే మార్కెట్లలో ఆశీల్ రేట్లు నిర్ధారిస్తూ పట్టికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అవి ఎక్కడా ప్రదర్శించడంలేదు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
ఆశీల్ వసూళ్ల విషయంలో మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరించడం చూస్తుంటే వారి పాత్ర పైన పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆశీల్ కాంట్రాక్టర్ కు వత్తాసు పలకడంతో పాటు అశీల్ వసూలుకు ఇచ్చే స్లిప్పులపైనా మున్సిపల్ అధికారిక సీల్ ను వేయడం చూస్తుంటే దందా అధికారులుకు తెలిసే జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది. పైగా మున్సిపల్ అధికారులకు నెలవారీగా మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. దీంతో అధికారులు సదరు కాంట్రాక్టర్ నుంచి భారీగా లాభపడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పైగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ను వివరణ అడిగితే చెప్పేందుకు నిరాకరించడమే కాకుండా దాటవేత ధోరణిగా మాట్లాడడం చూస్తుంటే అధికారుల ప్రవర్తనపై మరింత అనుమానం కలుగుతోంది. మున్సిపల్ అధికారులు తీరు కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. పైగా అధికారులు వ్యాపారులతో కాంట్రాక్టర్ చెప్పిన ధరలు కరెక్టే అంటూ చెప్పడం చూస్తుంటే అనుమానం మరింతగా బలపడుతోంది. అధికారులు మున్సిపల్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆశీల్ వసూళ్ల విషయంపై స్పందనలో సైతం పెద్దాపురం ఆర్జీవోకు ఫిర్యాదు అందింది. రూ.లక్షల రూపాయల బడుగు జీవుల కష్టాన్ని కాంట్రాక్టర్ దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
దోపిడిని నియంత్రించాలి..
ఆశీల్ వసూళ్ల విషయంలో దోపిడీని నియంత్రించాలి. ఈవిషయంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. సైకిళ్లపై ఎండల్లో నిలబడి వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు రోజంతా కష్టపడితే రూ. రెండు వందలు వస్తాయి. ఆకష్టంలో సొమ్మును ఆశీల్ పేరుతో పిండేస్తే ఎలా బతుకుతారు. చిరు వ్యాపారికి రోజుకు రూ.7 ఆశీలు అయితే రూ.40, వాహనానికి రూ.60 అయితే రూ.450 వసూలు చేయడం అన్యాయం. ఈ విషయంపై స్పందనలో ఫిర్యాదు చేశాను. మున్సిపల్ కమిషనర్ ఈవిషయంలో మెతకవైఖరి అవలంభిస్తున్నారు. పట్టణ సమస్యలు చెబుతుంటే నాఫోన్ నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈవిషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాను.
గుణ్ణం లక్ష్మణరావు
ఛైర్మన్, ఫర్ ది పీపుల్ ఫౌండేషన్
పెద్దాపురం







