• రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల డిమాండ్
• ఆర్డీవో కార్యాలయ ముట్టడితో దిగివచ్చిన పోలీసులు
• ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని డీఎస్సీ హామీతో ఆందోళన విరమణ
UPDATED 30th NOVEMBER 2020 MONDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): దళితులను వేధించిన పెద్దాపురం ఎస్ఐ ఏ. బాలాజీని తక్షణమే సస్పెండ్ చేయాలని, అలాగే దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమం సోమవారం ఆందోళనకరంగా మారింది. మండల పరిధిలోని పులిమేరు గ్రామంలో అగ్ర కులానికి చెందిన మల్లినీడి జయరాజు అనే వ్యక్తి కోవిడ్ బాధితుడిని గృహంలో ఉంచి రహస్యంగా వైద్యం చేయిస్తున్నారని, ఈ విషయంపై ప్రశ్నించినందుకు జయరాజు కుమారులైన కృపాసాగర్, ప్రేమసాగర్ దళితులను దుర్భాషలాడడంతో పాటు కత్తులతో బెదిరించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే పెద్దాపురం ఎస్ఐ మెతకవైఖరి అవలంభించారని, ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. రైతు కూలీలు చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉధృతమై పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో సామర్లకోట ఎస్ఐ సుమంత్ అక్కడకు చేరుకుని రైతు కూలీ సంఘం నాయకుడు కర్నాకుల వీరాంజనేయులుతో చర్చలు జరిపారు. జయరాజు అతని కుమారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే వారిని అరెస్టు చేస్తామని వారికి తెలిపారు. అప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడంతో డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావును కలిసి ఎస్ఐ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని రైతు కూలీ సంఘం నాయకులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి. రమేష్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగభూషణం, పీ.డీ.ఎస్.యు విజృంభణ జిల్లా ప్రధాన కార్యదర్శి కడితి సతీష్, కె. వెంకటేశులు, జై భీమ్ యూత్ సభ్యులు, అధిక సంఖ్యలో రైతుకూలీలు పాల్గొన్నారు.







