UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన భాద్యత ప్రత్యేకాధికారులదే అని కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం పూర్తవటంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైందని, ఎంపీడీవోలు, మండల తహసీల్దార్లు, ఈవోఆర్‌డీలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంఈవోలు, వ్యవసాయ అధికారులు, సహాయ ఇంజినీర్లు, వివిధ శాఖల గెజిటెడ్ అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందన్నారు. ఇంతకాలం సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన పాలకవర్గాలు పంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర పనులను పర్యవేక్షించారని, ఇపుడు ప్రత్యేక అధికారులే పంచాయతీల పాలన వ్యవహారాలను చూడాల్సి ఉందన్నారు. మాతృశాఖ విధులను నిర్వహిస్తూనే పంచాయతీలపై పర్యవేక్షణ చూడాలని, ఒక రకంగా కొంత పనిభారం పడుతుందని, క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్. శివకుమార్, ఎంపీడీవో సి.హెచ్. జగ్గారావు, ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య, వ్యవసాయ అధికారి ఎన్. శ్యామూల్ జాన్, పంచాయతీ రాజ్ డిఇ వై. హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.







