UPDATED 1st AUGUST 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: కార్మికుల హక్కులు, చట్టాలను తొలగించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అన్నారు. స్థానిక మదర్ థెరిస్సా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో గురువారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కేలే చట్టాలను మార్చేందుకు పెద్దఎత్తున కుట్ర జరుగుతోందని అన్నారు. కార్పోరేట్ సంస్థల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు రెండున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలిశెట్టి రామదాసు, కామిరెడ్డి బోడకొండ, సానా పశువులరావు, వజ్రపు రవి, అన్నవరం, అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.







