UPDATED 1st DECEMBER 2018 SATURDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్), ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ సంస్థలు ఎఐసిటిఇ-సిఐఐ (న్యూఢిల్లీ)చే విశేష గుర్తింపు (సిల్వర్) సాధించి జిల్లాలో మొదటి కళాశాలగా నిలిచినట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు వివిధ పారిశ్రామిక సంస్థలతో అవగాహన కుదుర్చుకొని పరస్పరం జ్ఞాన సముపార్జనకు సహకరించుకొనేలా ఒప్పందం చేసుకొన్న సంస్థలకు ఎఐసిటిఇ-సిఐఐ ఒక సర్వే నిర్వహించి ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ గుర్తింపు ద్వారా నూతన విధానాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల ఎఐసిటిఇ-సిఐఐచే విశేష గుర్తింపు (సిల్వర్) సాధించి జిల్లాలో మొదటి కళాశాలగా నిలిచిందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో గోల్డ్ సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఏకైక సంస్థగా ఇంతటి విశేష గుర్తింపు పొందడానికి కారణమైన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, తదితరులు పాల్గొన్నారు.







