కాళ్లలో రాడ్లు ఉన్నాయన్నా కనికరించలేదు

ఎస్సై, కొందరు నాయకుల తీరుతోనే బలుసులపేట దళిత యువకుడి ఆత్మహత్య
ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ వెల్లడి

UPDATED 7 January 2022 

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : ‘‘కాళ్లలో రాడ్లు ఉన్నాయి... కొట్టొద్దు సార్‌’ అని గిరీష్‌బాబు ప్రాధేయపడితే ‘రాడ్లు ఎక్కడున్నాయి చెప్పు...’ అని లాఠీకి రబ్బరు కట్టి, కాళ్ల మీదే కొట్టి ఎస్సై రాక్షస ఆనందం పొందాడని’ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య, మానభంగం, జాతి ద్రోహం వంటి కేసుల్లోనూ ఇంతలా కొట్టే చట్టాలు లేవన్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తాను పోటీ చేయడంతో తప్పుడు కేసు పెట్టించి, తన తమ్ముడిని చిత్రహింసలకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని గిరీష్‌బాబు సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. దీంతో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌, సభ్యుడు బసవరావు గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారితో మాట్లాడారు. అనంతరం విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ...చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు, ఒత్తిడి తీసుకొచ్చిన నాయకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గిరీష్‌బాబుది ఆత్మహత్య కాదన్నారు. దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఎస్సైకి తప్పుడు నివేదిక ఇచ్చి, కేసులు బనాయించేలా చేశారని పేర్కొన్నారు. గిరీష్‌పై వాలంటీర్‌ పెట్టింది పెట్టీ కేసు కాగా... ఎస్సై ఎవరిని సంతృప్తి పర్చడం కోసం ఆ పిటిషన్‌ను మార్చి కేసు పెట్టారని ప్రశ్నించారు. 3 రోజులుగా కొట్టడంతోనే వేదనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఎస్సై ఏకపక్షంగా, కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారని అభిప్రాయపడ్డారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి తక్షణం రూ.4,12,500 అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. గిరీష్‌ సోదరుడు ప్రవీణ్‌కుమార్‌కు కలెక్టర్‌తో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కమిషన్‌ సభ్యుడు బసవరావు మాట్లాడుతూ... చిన్న పిటీషన్‌కు రాద్ధాంతం చేసి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేలా ఎస్సై వ్యవహరించారని కమిషన్‌ పరిశీలనలో తేలిందన్నారు. ఎస్సైని సస్పెండ్‌ చేయాలని ఆదేశించామన్నారు. పోలీసులు కొట్టడం వల్లే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎస్సైని 24 గంటల్లో డిస్మిస్‌ చేయాలని, అతన్ని ప్రభావితం చేసిన వైసీపీ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

వీఆర్‌కు ఎస్సై:

బలుసులపేట ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై బి.అభిమన్యును వీఆర్‌కు పంపినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు గురువారం రాత్రి తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us