* జిల్లా పరిషత్ సిఈవో ఎం. జ్యోతి
UPDATED 8th JANUARY 2020 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమీషన్ నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ సిఈవో ఎం. జ్యోతి పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పెద్దాపురం డివిజన్ పరిధిలో గల 12 మండలాల ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈవో ఎం. జ్యోతి పాల్గొని మాట్లాడుతూ త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నందున అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్న ఎంపీడీవోలు ఎన్నికల నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని, దీనికి సంబంధించిన మెటీరియల్ ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, విద్యుత్, ఫర్నీచర్, తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలీసు శాఖ గుర్తించిన సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే తెలుసుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని అన్నారు. పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమీషన్ జారీ చేసిన నియమ నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవోలు తనిఖీ చేయాలని అన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు సమర్పించే నామినేషన్ పత్రాలు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తీసుకోవలసిన మెటీరియల్, ఎన్నికల నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇచ్చే ట్రైనీలను ముందుగానే గుర్తించాలని అన్నారు. శిక్షణ ఇచ్చే కార్యాలయం, మెటీరియల్ పంపిణీ, పోలింగ్ బాక్సులు, రూట్ అధికారులు, నామినేషన్ వేసే అభ్యర్థుల అర్హతలు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజువారీ నివేదిక, రోజువారీ మెయిల్ చెకింగ్, తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి డి. పాండురంగారావు, డివిజినల్ పంచాయతీ అధికారి నరసింహారావు, వ్యవసాయశాఖ ఎడి ఎం. రత్నప్రశాంతి, పెద్దాపురం ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, డివిజన్ పరిధిలోని పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.







