UPDATED 28th APRIL 2018 SATURDAY 6:00 PM
సామర్లకోట: స్థానిక నిమ్మతోటలో ఉన్న ప్రతిభా విద్యానికేతన్ పాఠశాల 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు హాజరయ్యారు. ముందుగా శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి క్రమశిక్షణ, సత్ ప్రవర్తన అలవరచుకోవాలన్నారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్ లో ఉన్నతంగా ఎదిగేందుకు విద్య ఒక్కటే మార్గమన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యతో పాటు వారికి కావలసిన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన శేషారెడ్డి దంపతులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ రవికుమార్, ప్రిన్సిపాల్ టి. సునీత, టి. అరుణ, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.







