UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 5:30 PM
మారేడుమిల్లి: గుర్తేడు-మారేడుమిల్లి రహదారిలో బస్సులు రాకపోకలకు అనువుగా సుమారు రూ. 70 లక్షలతో మరమ్మత్తులు, సంగవాగుపై కల్వర్టు నిర్మిస్తున్నట్లు ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ వెల్లడించారు. మండల పరిధిలోని సంగవాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం దేవరపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమం గ్రామసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు మూలంగా మారేడుమిల్లి- గుర్తేడు రోడ్డు మరమ్మతులకు గురైందని, మీకోసం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయా ప్రాంత గిరిజనులు వినతులు సమర్పించగా ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ను సంప్రదించగా వెంటనే రూ. 70 లక్షలు మరమ్మతుల కోసం కేటాయించారని ఆయన తెలిపారు. గ్రామపరిధిలోని సమస్యలను గ్రామస్థాయిలో పర్యటించిన అధికార బృందాలకు తెలపాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికై గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే సంక్షేమ ఫలాల లబ్ధిని అర్హులందరూ పొందేలా అధికారులు చొరవ చూపాలన్నారు. దేవరపల్లి గ్రామస్థుల అభ్యర్ధన మేరకు హౌసింగ్ అదనపు నిధులు పొందేందుకు ఇతర సంక్షేమ ఫలాలు విద్య, ఉద్యోగావకాశాల కొరకు కులధృవీకరణ పత్రాలు జారీకై ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తామని గ్రామస్తులుకు హామీ ఇచ్చారు. రామన్నవలస వద్ద కల్వర్టు రోడ్డు నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే వాగుపై ఇరిగేషన్ ప్రాజెక్టు 500 ఎకరాలు ఆయకట్టుకు వీలుగా మంజూరు కూడా తగు చర్యలు చేపడతామన్నారు. చంద్రన్న భీమా పరిహారాలు చెల్లింపులు, రేషన్ సరఫరా, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ వేతనాలు చెల్లింపులు, త్రాగునీటిని సరఫరా సమస్యలు గూర్చి ఆరా తీశారు. సోలార్ యూనిట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఆయాను నియమిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు గ్రామదర్శిని- గ్రామవికాసం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధిపథంలో నడిచేలా పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమాలల్లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం డిఇ వేణుగోపాల్, ఎఇలు, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.







