UPDATED 16th AUGUST 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో, స్థానిక బడేలమ్మ చెరువు వద్ద గల నవదుర్గ ఆలయంలో ఆలయ నిర్వాహకురాలు దేవి పుత్రిక కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ అధికారులు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నవదుర్గ ఆలయంలో వ్రత పూజలతో పాటు సామూహిక కుంకుమార్చనలతో పాటు వాయన సత్కారాలతో అమ్మ కనక విజయలక్ష్మి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.







