ఉత్కంఠం... ఉత్సాహం

* రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన 
* సీనియర్, జూనియర్ విభాగాల్లో సత్తా చాటిన తూర్పుగోదావరి జిల్లా 
UPDATED 3rd FEBRUARY 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక ఉండూరు ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్డులో శ్రీ కుమార భీమేశ్వరస్వామి కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఈ ప్రదర్శనలో జిల్లా ఎడ్లు సీనియర్, జూనియర్ విభాగాల్లో మొదటి, మూడు స్థానాల్లో నిలిచాయి. దవులూరి దొరబాబు సహకారంతో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అత్తిలి వెంకట సీతారామస్వామి శనివారం ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, తదితర జిల్లాలకు చెందిన ఎడ్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో ఏడు జతలు, జూనియర్ విభాగంలో 19 జతలు ఎడ్లు పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో సామర్లకోటకు చెందిన వల్లూరి సతేంద్ర కుమార్ ఎడ్లు 1600 మీటర్లు దూరాన్ని ఐదు నిముషాల 37 సెకండ్లు 59 పాయింట్లతో అధిగమించి ప్రథమ బహుమతిని, గండేపల్లి మండలం పి. నాయకంపల్లికి చెందిన గద్దె పావని ఎడ్లు ఐదు నిముషాల 38 సెకండ్లు 25 పాయింట్లతో ద్వితీయస్థానాన్ని , పెద్దాపురం మండలం ఆర్.బి. కొత్తూరుకు చెందిన చుండ్రు సత్యనారాయణ ఎడ్లు ఆరు నిముషాల ఐదు సెకన్లలో 87 పాయింట్లతో తృతీయ స్థానంలో గెలుపొందాయి. ఈ పోటీల్లో ప్రథమ విజేతకు రూ.16 వేలు, ద్వితీయ విజేతకు రూ.14 వేలు, తృతీయ విజేతకు రూ.12 వేలు నగదు పురస్కారం, మెమెంటోలు అందచేశారు. అలాగే జూనియర్  విభాగంలో సామర్లకోటకు చెందిన వల్లూరి సతేంద్ర కుమార్ ప్రథమ బహుమతిగా రూ. 12 వేలు, హుకుంపేటకు చెందిన కిమిడి ప్రణతి లక్ష్మి ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తిరమాలికి చెందిన కానూరి వీర వెంకటకృష్ణకు తృతీయ బహుమతిగా రూ. ఎనిమిది వేలు నగదు,పురస్కారం,  మెమెంటోలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, సిద్దా నాగరాజు, యనమల కృష్ణ, మేకా శ్రీనివాస్, నేతల హరి, అడబాల సూర్యనారాయణ, జాన్ మోజెస్, తదితరులు పాల్గొన్నారు.                   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us