UPDATED 27th MAY 2018 SUNDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో గత మూడు రోజులుగా నిర్వహించిన ఫైనాన్స్ విభాగంలో అధ్యాపక అభివృద్ది కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ సి.హెచ్. కృష్ణుడు హాజరై అధ్యాపకులకు అవసరమైన అనేక అంశాలపై పరిశీలనాత్మకంగా వివరించారు. ముగింపు రోజున వ్యక్తిత్వ వికాస బోధనా పద్ధతులు, సందర్భ పరిశీలన వికాస పద్దతులు గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు ప్రణాళికబద్దంగా బోధించే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకున్న తర్వాత విద్యార్థులకు బోధించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచంలో అధ్యాపకులు సామాజిక మార్పులకు అనుగుణంగా ఆధునిక అంశాలపై పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలని సూచించారు. తమ కళాశాల అధ్యాపకులు పుస్తక పరిజ్ఞానంలో సమానంగా సమాజమార్పుకు అవసరమైన నూతన పద్దతులను విద్యార్థులకు అందిస్తున్నారని, వీటి ద్వారా నవ సమాజ నిర్మాణ స్థాపనకు సాధ్యపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.







