UPDATED 6th MARCH 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ నెల ఎనిమిదవ తేదీన క్యాంపస్ లో ప్రతిష్ఠించనున్న షిరిడీ సాయిబాబా, సరస్వతీదేవి పాలరాతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలను పురస్కరించుకుని సోమవారం నుంచి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమాలలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు, కార్యదర్శి కృష్ణదీపక్ రెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మాల ధరించిన బాబా భక్తుల సాయి నామస్మరణ, భక్తి గీతాలతో ఆదిత్య ప్రాంగణం మార్మోగుతోంది. ఎనిమిదవ తేదీ గురువారం గణపతి పూజ, గర్తన్యాసం, వీర్యద్రవ్యానిక్షేపణం, యంత్రస్థాపన, బింబస్థాపన, కలాన్యాసం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్టలు జరుగుతాయని వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.







