*అక్రిడేషన్స్ మంజూరుకు సవాలక్ష కొర్రీలు
*మళ్లీ మళ్లీ ధరఖాస్తు చేసుకోవాలంటూ సందేశాలు
*ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు
*సరైన సమాధానం చెప్పలేని స్థితిలో సమాచార శాఖ అధికారులు
*అయోమయంలో పాత్రికేయులు
UPDATED 2nd JULY 2021 FRIDAY 3:00 PM
కాకినాడ: సమాచార శాఖ అధికారుల తీరు పాత్రికేయులకు శాపంగా మారింది. అక్రిడేషన్ల మంజూరుకు సవాలక్ష కొర్రీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పైగా తమకే ఈవిషయంపై తమకే పూర్తిగా అవగాహన లేదని చెప్పడం సిగ్గుచేటు. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా పాత్రికేయుల అక్రిడేషన్ల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో తమకు గుర్తింపు లేకుండా పోయిందని పాత్రికేయులు గగ్గోలు పెడుతున్నారు. అక్రిడేషన్ల జారీలో జర్నలిస్ట్ సంఘాల పాత్ర లేకపోవడం శుభ పరిణామమే అయినా సంబంధిత శాఖ అధికారులు అక్రిడేషన్ల జారీకి పెట్టే షరతులు పాత్రికేయులకు శాపంగా మారాయి. డిఫర్డ్, వేరిఫైడ్, రిసీవ్డ్ అని రకరకాలుగా స్టేటస్ లో చూపించడంతో మళ్లీ అప్ లోడ్ చెయ్యాలా లేదా అనే సందేహంలో పాత్రికేయులు ఉన్నారు. గతంలో కొంతమంది పాత్రికేయులు కొన్ని ధృవపత్రాలు సబ్మిట్ చేయకపోయినా వాళ్ళకి అక్రిడేషన్లు మంజూరు అయినట్లు లిస్టులో చూపించేశారు. కనీసం కొంతమంది పాత్రికేయులు తమ తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, సెల్ఫ్ డిక్లరేషన్, పాన్ కార్డు, జీఎస్టీ ఇలా చాలా వరకూ కూడా ధృవీకరణ పత్రాలు సమాచార శాఖకి అందచేయనప్పటికీ వాళ్ళకి అక్రిడేషన్లు మంజూరు అయినట్లు లిస్ట్ లో ప్రకటించేశారు. సమాచార శాఖ అధికారులు సదరు దరఖాస్తులను ఎలా పరిశీలించారో ఆ దేవుడికే తెలియాలి. పైగా ఫోన్ చేసి పాత్రికేయులు తమ సందేహాలను నివృత్తి చేసుకుందామంటే అధికారులు ఒక్కొక్కరికి ఒక్కోలా సమాధానాలు చెబుతున్నారు. ఈ విషయంలో వారికే సరైన పరిజ్ఞానం లేకపోవడంతో పాత్రికేయులు మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా ధృవపత్రాలు అప్ లోడ్ చేసేందుకు పూర్తి స్థాయిలో అవకాశం లేకుండా వెబ్ సైట్ ఉండటంతో ఇదేం ఖర్మరా బాబు అని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అక్రిడేషన్ల మంజూరుకు కృషి చేయాలని పాత్రికేయులు కోరుతున్నారు.







