UPDATED 3rd AUGUST 2017 THURSDAY 7:00 PM
కాకినాడ: జిల్లాలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా నిరోధానికి ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరు 1098పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి హాల్లో ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఉందని, దీనిని అరికట్టడానికి పోలీసు, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, పోలీసుస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ నంబరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. ఎక్కడైనా మహిళలు, పిల్లలు అసహాయ స్థితిలో ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1098కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.







