UPDATED 20th AUGUST 2018 MONDAY 5:30 PM
పెద్దాపురం: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును పొందాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక మహారాణీ కళాశాలలో తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఓటు హక్కు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యత అంశంపై విద్యార్థినీ విద్యార్థులకు సోమవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆర్డీవో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 1-1-2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలియచేసే ఓటును వినియోగించుకునేలా విద్యార్థులు అవగాహన కలిగి ఉండి, తద్వారా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, చుట్టుప్రక్కల వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని, ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మనుగడలోకి వస్తాయని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో విద్యార్థులు చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఓటరుగా నమోదును ఆన్ లైన్ ద్వారా చేయించుకోవాలని, వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి సమ్మర్ రివిజన్ ప్రారంభమవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కాబడి ఓటుహక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆశాలతా పీటర్, ఓటరు నమోదు కోఆర్డినేటర్ ఏసుబాబు, ఆర్ఐ తేజ, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







