* వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
UPDATED 13th JULY 2020 MONDAY 6:30 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): గోదావరి వరదలు దృష్టిలో ఉంచుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక రమణయ్య పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయని, ముంపు ప్రాంత వాసులను తరలించడానికి ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలక్టర్లతో మాట్లాడడం జరిగిందన్నారు. గోదావరి వరదల వలన ముంపునకు గురయ్యే ప్రతీ హాబిటేషన్ కు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత వరదల సమయంలో ముందస్తు చర్యలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందన్నారు. పోలవరం కాపర్ డ్యామ్ ముందస్తుగా నిర్మాణం చేపట్టడం ద్వారా గోదావరి జిల్లా వాసులకు ముంపు సమస్య తలెత్తుతుందని, గత ఏడాది సంభవించిన గోదావరి సమయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి బాధితులను అన్ని విధాల ఆదుకునేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రజల్లో అసమానతలు తొలగించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 21 పధకాలను వినూత్నంగా నాలుగు లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.







