UPDATED 20th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం నవర, పి. వేమవరం గ్రామాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మంత్రి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవర గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న పశు వైద్యశాలకు శంకుస్థాపన, పి.వేమవరంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ నూతన భవనం, రూ. ఆరు లక్షలతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, తదితర వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణ సౌకర్యం ద్వారా సుమారు 50వేల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద రూ.10వేలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తున్నామని, రైతులకు రుణమాఫీ, ప్రతీ గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, సామాజిక భవనాలను నిర్మిస్తున్నామన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసం పశు వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ, క్రీడా మైదానం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. పి. వేమవరంలో 200 మందికి కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించామని, రూ.కోటి 20లక్షల వ్యయంతో పి. వేమవరంలో రోడ్డు నిర్మించామని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ హౌసింగ్ రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ చెత్తను చెత్త బుట్టలో వేయటం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం చెత్తబుట్టలు, చంద్రన్న క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు, సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకట్రాజు, వైస్ చైర్మన్ వెన్నా పద్మనాభం, టిడిపి మండల కమిటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, టిడిపి నాయకులు గుమ్మళ్ళ రామకృష్ణ, ఎంపీడీవో సిహెచ్ జగ్గారావు, పశుసంవర్థక శాఖ ఏడీ తాతయ్య, ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.







