అంతర్జాతీయస్థాయిలో నృత్యంలో రాణిస్తున్న అలమండ

* కష్టేఫలికి నిదర్శనం
* సాగర సంగమం సినిమా స్పూర్తి

UPDATED 15th JANUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: సాగర సంగమం సినిమాలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన నృత్యాన్ని స్పూర్తిగా తీసుకుని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన నృత్యకారుడు అలమండ ప్రసాద్ తనదైన శైలిలో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. పట్టుదల, కృషి పెట్టుబడిగా పెట్టి శ్రమిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. వృత్తిపరంగా ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నా భారతదేశ  సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలిలో రాణిస్తూ దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి వాటిని సొంతం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన అలమండ తాతారావు, మంగ తాయారమ్మ దంపతులకు అలమండ ప్రసాద్ జన్మించారు. భార్య దుర్గాభవాని, ముగ్గురు పిల్లలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లితోపాటు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. 
సాగర సంగమం చిత్రంలో కమల్ నృత్యం ప్రేరణ
ప్రసాద్ 7వ తరగతి చదువుచుండగా వచ్చిన 'సాగరసంగమం' చిత్రంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన నృత్య ప్రదర్శనలకు ఆకర్షితులై అప్పటి నుంచి ఆయనకు సాంప్రదాయ నృత్యంపై ఆసక్తి పెరిగిందని  చెప్పారు. ఆయనకున్న పట్టుదలకు తల్లి మంగతాయారమ్మ పూర్తి సహకారం, ప్రోత్సాహం తోడవ్వడంతో నృత్య శిక్షణకు 7వ తరగతిలో అరంగ్రేటం చేశారు.
నృత్య గురువులు 
నృత్యంపై ఉన్న ఆసక్తిని నిజం చేసుకొనేందుకు  కాకినాడకు చెందిన దేవీ నృత్యానికేతన్ నిర్వాహకులు సత్యనారాయణ వద్ద శిక్షణకు చేరి భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం పొందారు. ప్రస్తుతం కాకినాడకు చెందిన నృత్యాంజలి కళానిలయం నిర్వాహకులు హరిలోకేష్ శర్మ, కృష్ణవేణి దంపతుల వద్ద నేటికీ తర్ఫీదు పొందుతున్నారు. నేటికీ దేశ, విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.1988వ సంవత్సరంలో సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ ఆడిటోరియం ప్రారంభ కార్యక్రమంలో తొలిసారిగా నృత్యప్రదర్శన ఇచ్చిన ప్రసాద్ అనంతరం అంచెలంచెలుగా ఎదిగి సింగపూర్, వియత్నాం, మలేషియా దేశాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వారణాసి, చెన్నై, బెంగుళూరు, డెహ్రాడూన్,  భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో జరిగిన అంతర్జాతీయస్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామం, పాదగయ క్షేత్రం పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామి, పద్మావతి అమ్మవార్ల బ్రహెూత్సవాలు, అలాగే తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి నాద నీరాజనం, గోదావరి పుష్కరాల్లోనూ తన నృత్య ప్రదర్శనలతో విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 49 ఏళ్ల వయస్సులో అవలీలగా నృత్యంలో ఆయన ప్రదర్శనలు ఇవ్వడంతో పలువురి మన్ననలు అందుకొంటున్నారు.
రికార్డులు 
రాజమండ్రికి చెందిన శ్రీ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారిచే "ఆంధ్రశ్రీ' పురస్కారం, బెస్ట్  సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవార్డును విశాఖపట్నం, రాజమండ్రి ఫిలాంత్రోఫిక్ సొసైటీచే సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారం, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థచే ప్రముఖ సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ఆంధ్ర కళా సామ్రాట్ అవార్డు, తిరుపతికి చెందిన రంగస్థలి మాస పత్రిక వారిచే ఎన్టీఆర్ స్మారక పురస్కారం, వియత్నాం పైడా ఇంటర్నేషనల్ వారిచే ఎక్స్ లెన్సీ అవార్డు, మలేషియా తెలుగు అసోసియేషన్ వారిచే హేవళంబి ఉగాది పురస్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా హైదరాబాద్ లో బింగి మల్లీశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 ఎక్స్ లెన్సీ అవార్డు, విశాఖపట్నంకు చెందిన అర్ఫిత సంస్థచే బెస్ట్ సిటిజెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు, తెలంగాణాకు చెందిన అవార్డు టీచర్స్ అసోసియేషన్ (ఆటా) పురస్కారం, కర్ణాటకకు చెందిన నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ వారిచే శ్రీ గురు సద్భావనా అవార్డు, అలాగే ప్రైడ్ ఇండియా ఎక్స్ లెన్సీ అవార్డు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు చేతుల మీదుగా అందుకున్నారు. మహరాష్ట్రలోగల షిర్డీ సాయినాధుని సన్నిధితోపాటు, ఉత్తరప్రదేశ్ లో గల కాశీ విశ్వేశ్వరుని పుణ్యక్షేత్రం, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి, చెన్నైలో గల తిరువీరక్కాడు అమ్మవారి సన్నిధి, హైదరాబాదు, కాకినాడలతో పాటు జిల్లాలో పలుచోట్ల చేసిన ప్రదర్శనల్లో అలమండ అనేక రికార్డులు కైవసం చేసుకున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో జరిగిన జాతీయస్థాయి రంగ మహోత్సవ పోటీల్లో కూచిపూడి విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం గెల్చుకున్నారు. బెంగుళూరులో కల్పశ్రీ నాట్య ప్రవీణ అవార్డు, ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో జరిగిన ఇండియా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ కళా సన్మాన్ అవార్డు, శ్రీ సాయి నృత్యాంజలి నాట్యాలయం వారిచే శ్రీశైల నాట్యప్రభ అవార్డు, సామర్లకోట లయన్స్ క్లబ్ వారిచే బెస్ట్ సిటిజెన్ అవార్డు, మలేషియాలో భరత నాట్యరత్నఅవార్డు-2018, నాట్య కళాభూషణ్ అవార్డును డిల్లీలో గల ఎపీ భవన్ లో, నాట్య కళా ప్రవీణ అవార్డును కళారాధన డ్యాన్స్ అకాడమీ (విశాఖపట్నం)చే అందుకున్నారు. 2018 ఆగస్టు 15వ తేదీ కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పురస్కారం జిల్లా ఇంచార్జి మంత్రి కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ ప్రసాద్ నృత్యకళను గుర్తించి తూర్పుగోదావరి జిల్లాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటరుగా నియమించి అభినందించారు. కోఆర్డినేటరుగా ప్రసాద్ ఇంతవరకూ కోస్తాంధ్ర, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మందికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు రికార్డులు, అవార్డులు తీసుకుంటూ మరోవైపు రికార్డులు జారీ చేస్తూ తనదైన శైలిలో భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో మరింత ప్రావీణ్యం సంపాదించి, ఆశయాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు  తెలిపారు. 
సందేశం  
భారతదేశంలో అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను పరిరక్షించాలని, అందుకు విద్యార్థులు బాల్యం నుంచి చదువుతోపాటు సాంప్రదాయ నృత్యకళల్లో శిక్షణ పొంది వాటిని కాపాడాలని కోరుతున్నారు. నృత్య శిక్షణతో శారీరక, మానసిక ఆరోగ్యం కలగడంతోపాటు, జీవితంలో సంతృప్తి కలిగి అనేక మందికి ఆదర్శవంతంగా ఉండేలా కళాకారులు ముందుకు సాగాలని అన్నారు. అలాగే తాను ఈ రంగంలో రాణించడానికి సహకరిస్తున్న గురువులు హరిలోకేష్ శర్మ, కృష్ణవేణి దంపతులకు, బింగీ నరేంద్ర గౌడ్, కుటుంబ సభ్యులకు ఋణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us