UPDATED 29th JUNE 2019 SATURDAY 6:00 PM
పెద్దాపురం: బాల్య వివాహాల నిరోధం, హక్కుల పరిరక్షణకు కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు వి. గాంధీబాబు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రభుత్వ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధం, హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడానికి మండల, గ్రామస్థాయి కమిటీ సభ్యుల కృషి ఎంతైనా ఉందని తెలిపారు. చట్టం అమలు, నష్టాల గురించి గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలని అన్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదవుతున్నాయని, చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు.18 సంవత్సరాల లోపు అమ్మాయి, 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం చేయరాదని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, ఒక లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివాహ సమయంలో తల్లిదండ్రులతో పాటు వివాహం చేసే పురోహితుడు, చర్చి ఫాదర్, ముస్లిం మత పెద్ద, అలాగే వివాహానికి షామియానా వేసిన వారిపై కూడా కేసులు నమోదవుతాయని అన్నారు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే సమావేశంలో మొదటి అంశం బాల్య వివాహాలపై సమీక్షిస్తానని తెలిపారని అన్నారు. పోలీస్, తహసీల్దార్, అంగన్వాడీ కార్యకర్త, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, సీడీపీవోలతో కమిటీలు ఏర్పాటుచేసి వాటిపై సమీక్షను అందరికీ అనుకూలంగా ఉండే తేదీ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు మండలాల వారీగా బాల్య వివాహాలపై నమోదైన కేసులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో వారికి ఎదురైన సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే కోఆర్డినేషన్ మీటింగ్, పంచాయతీ మినిట్స్ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు ఎ.ఎస్.వి.ఎస్. కృష్ణకుమార్, ఐసిడిఎస్ పిడి సుఖజీవన్ బాబు, ఎస్ఎస్ ఎపిడి విజయభాస్కర్, పెద్దాపురం తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ, జిల్లా బాల్య వివాహాల నిరోధక అధికారి సిహెచ్ వెంకట్రావు, పెద్దాపురం సీడీపీవో ఆదుర్తి విజయలక్ష్మి, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సీడీపీవోలు, ఎంపిడివోలు, ఎస్సైలు, ఐసిడిఎస్ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.







