* జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి
UPDATED 8th JULY 2020 WEDNESDAY 7:00 PM
తుని (రెడ్ బీ న్యూస్): రైతుల సాంకేతికాభివృద్ధికి రైతు భరోసా కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. తుని మండలం తేటగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ముందుగా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల స్టాల్స్ ను సందర్శించిన అనంతరం పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలుకై అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 62 మండలాల్లో రైతు సమస్యలకు సంబంధించి వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ద్వారా సేవలు అందేవని ప్రస్తుతం 1220 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ రంగంలో అన్ని జిల్లాల కంటే అభివృద్ధిలో ముందంజలో ఉందని, ప్రభుత్వ పథకాలకు యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో విజయవంతం చేస్తున్నామని తెలిపారు. తేటగుంట రైతు భరోసా కేంద్రం పరిధిలో 1200 మంది రైతులు ఉండగా 120 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ప్రతీ రైతు రైతు భరోసా కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ప్రతీ సంవత్సరం జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొయ్య మురళీకృష్ణ, ఆత్మ చైర్మన్ తోట రాజు, పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ సుంకర బుల్లిబాబు, ఏవో అరుణ్ కుమార్, ఎంపిడివో శ్రీనివాస దొర, ఇంఛార్జ్ తహసీల్దార్ రాజు, ఉద్యాన,పశు సంవర్ధక శాఖల అధికారులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.







