UPDATED 31st JULY 2018 TUESDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎన్ ఎస్ఎస్ యూనిట్ విభాగాల ఆధ్వర్యంలో సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాలలో భాగంగా రంగంపేట మండలం పాత కోటపాడు, కొత్త కోటపాడు గ్రామాలలో స్వచ్ఛభారత్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆదిరెడ్డి రమేష్ పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇంటింటికీ తిరిగి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, వాతావరణంలో సంభవించే మార్పుల గురించి గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలసి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలమోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, వాలంటీర్స్ పాల్గొన్నారు.







