* ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 4th JULY 2020 SATURDAY 6:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): బ్రిటీష్ సామ్రాజ్య తెల్లదొరల దోపిడీని ఎదురించి దేశభక్తిని రగిలించి నేటి యువతరానికి విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సబ్-కలెక్టరు, ఐటీడీఏ ఇంఛార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి 124వ జయంతి వేడుకలు స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి పీవో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీషర్ల బానిస సంకెళ్ల నుంచి మన్యంవాసుల విముక్తి కోసం ఎడతెగని పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని, మహనీయుల ఆశయాలను త్రికరణశుద్ధిగా ఆచరించడమే వారికి అర్పించే ఘననివాళి అని ఆయన అన్నారు. తెలుగువారి శౌర్య పరాక్రమాలు చాటి చెప్పిన యోధుడు అల్లూరి అని, బాల్యం నుంచి అనితరసాధ్యమైన తెగింపు, పోరాట పటిమ, నైపుణ్యంతో గిరిజనులను సమీకరించుకోవడం వంటి గొప్ప లక్షణాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఆయన పోరాట స్పూర్తిని భావితరాలకు తెలియజేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పరిపాలనాధికారి డి.ఎన్.వి. రమణ, ఈఈ పి. రమాదేవి, వెంకటేశ్వరరావు డిఎస్ఓ ఆర్. భాస్కరరావు, మేనేజర్ రాజ్ కుమార్, పిహెచ్ఓ సత్యనారాయణ, ఎపిఒ రబ్బరు నాగరాజు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ సిబ్బంది సీతారాం, రమణరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కె. నరసింహారావు, మిత్రా, దారా లోవరాజు, భూషణం, తదితరులు పాల్గొన్నారు.







