UPDATED 6th JUNE 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: అంగన్వాడీ సేవలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని ఐసిడిఎస్ పిడి దాసరి సుఖజీవన్ బాబు అన్నారు. సామర్లకోట పట్టణం 13,14 వార్డులు, సంగీతరావుపేట, పెన్షన్ లైన్ తదితర ప్రాంతాల్లో గల అంగన్వాడీ కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉత్తమ విద్యతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు కేంద్రాల్లో వినూత్న భోధనా పద్దతుల ద్వారా చిన్నారులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకూ ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ పేరిట మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగానే సామాజిక వేడుకలు, అంగన్వాడీ బాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గల గర్భిణీలను గుర్తించి పౌష్ఠికాహారం అందచేస్తున్నామని అన్నారు. అలాగే ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలను గుర్తించి అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడం, మూడు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీలో, అయిదు సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిడిపివో పద్మావతి, సూపర్ వైజర్లు బాలాత్రిపుర సుందరి, నళిని, వినయ్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







