UPDATED 9th MARCH 2018 FRIDAY 5:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గత నెల నాలుగవ తేదీన నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరంలో ఆపరేషన్లు చేయించుకున్న 54 మందికి కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులచే మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేష్ నేతృత్వంలో టెక్నీషియన్ జానీ, సత్యవతి, జ్యోతి బృందం ఉదయం 9-00 గంటల నుంచి మధ్యాహ్నం 1-00 వరకు పరీక్షలు నిర్వహించారని, మరలా ఈ నెల 21న మరోసారి పరీక్షించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందచేస్తామని తెలిపారు. ఆపరేషన్లు చేయించుకున్న అందరూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరాలు, ప్రతీ నెలా 50 మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు కేజీలు చప్పున బియ్యం పంపిణీ, వస్త్రదానం వంటి కార్యక్రమాలతో గ్రామంలో సేవలందిస్తున్న సమితి సభ్యులను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధం, వైస్ ప్రెసిడెంట్ నువ్వుల వెంకట్రాజు, సభ్యులు తోటకూర సూర్య ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.







