రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో టిడిపిదే గెలుపు

UPDATED 18th SEPTEMBER 2017 MONDAY 9:00 PM

విశాఖపట్నం: రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీదేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఓల్డ్ సిటీ టౌన్‌హాల్లో సోమవారం నిర్వహించిన దక్షిణ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపుతో ప్రజలు టిడిపి వైపే ఉన్నారని తేలిందని, భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికలకైనా టిడిపి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. హుద్‌హుద్‌ తర్వాత విశాఖ నగరం దశదిశలా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రతీ ఇంటి సమస్య తమదిగా భావించి పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. త్వరలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్లు, ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు కూడా వివాహానికి ప్రభుత్వం సాయం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం జీవీఎంసీ 49వ వార్డు మల్కాపురం శ్రీ మరిడిమాంబ కల్యాణమండపంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.గణబాబు అధ్యక్షతన జరిగిన సమన్వయకమిటీ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన వారందరికీ చేరేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి ఫలితమే నంద్యాల, కాకినాడ ఎన్నికల విజయమన్నారు. ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు శీరం పైడిరాజు, తోట రత్నం, అప్పలనాయుడు, మజ్జి సోమేష్‌, కాకి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us