Updated 26 January 2022 Wednesday 06:00 PM
★ కిందకు జారిపోయిన జాతీయ పతాకం
★ సోషల్ మీడియాలో చూసి స్పందించిన ఆర్డీవో
★ వార్డు సచివాలయ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని మున్సిపల్ కమీషనర్ కు ఆదేశం
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): దేశపౌరులు జాతీయ జెండాకు అత్యున్నత స్థానమిచ్చి గౌరవిస్తారు. అలాంటిది గణతంత్ర దినోత్సవం రోజున, పైగా జాతిపిత మహాత్ముడి సాక్షిగా పట్టణంలో జాతీయ జండాకు అవమానం జరిగింది. స్థానిక మరిడమ్మ దేవస్థానం సమీపంలో ఉన్న వార్డు సచివాలయం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఉదయం సచివాలయ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అలాగే జాతీయ జండాకు వందన సమర్పణ చేశారు. తరువాత సిబ్బంది అక్కడి నుంచి ఎవరికి వారు వెళ్లిపోయారు. జాతీయ జెండాను సక్రమంగా కట్టని కారణంగా సాయంత్రం నాలుగు గంటల సమయానికి జాతీయ పతాకం కిందకు జారిపోయింది. దీంతో జెండా గాలికి అటు, ఇటు ఎగురుతూ కనిపించింది. అది గమనించిన ఓపౌరుడు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది పట్టణంలో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది. విషయం కాస్తా ఆర్డీవో పి.వెంకటరమణ దృష్టికి వెళ్లడంతో ఆయన మున్సిపల్ కమీషనర్ జంపా సురేంద్రకు ఫోన్ చేసి జెండాను సరిచేయించడంతో పాటు జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సచివాలయ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.







