UPDATED 16th JULY 2019 TUESDAY 6:00 PM
పెద్దాపురం: చంద్ర గ్రహణం నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండల పరిధిలో గల అన్ని దేవాలయాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం నివేదన అనంతరం మూసివేసినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. గ్రహణం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రారంభం కానున్నందున ఆలయ సంప్రదాయం ప్రకారం తలుపులు మూసివేసినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం గ్రహణ దోష పరిహార, సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ మాట్లాడుతూ భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతు గ్రహాలు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తారని, రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని, అందుకనే గ్రహణ సమయాలలో ఆలయాలను మూసివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.







