UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM
పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ప్రాంగణంలో గల ఆదిత్య డిగ్రీ కళాశాల (ఫోరెన్సిక్ కళాశాల) ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గురువారం పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004 నుంచి జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జరుపుతున్నారని, ప్రతీ ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అన్నారు. ఆదిత్య గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలుకండి అని పిలుపునిచ్చారు. ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. మోహన్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల విద్యార్థులలో నూతన ఆలోచనలు, మానసిక ప్రశాంతత, చురుకుతనం కలుగుతుందని అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుగుణ మాట్లాడుతూ దాతల నుంచి సేకరించిన రక్తాన్ని పేదప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనూరు సర్పంచ్ సింగన అరవిందకుమార్, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సి.హెచ్. నాగభూషణం, ఎన్ఎస్ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ టి. ప్రవీణ్, కో-ఆర్డినేటర్ ఎం. గోవర్ధన్, ఎన్ఎస్ఎస్ విద్యార్థి బృందం, తదితరులు పాల్గొన్నారు.







