UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 8:00 PM
గండేపల్లి : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి సభ్యులచే మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని, ప్రతీ గ్రామంలో వాడవాడలా జరుగు వినాయక చవితి ఉత్సవాలలో మట్టి విగ్రహాలనే వినియోగించేలా స్వచ్చంధ సంస్థలు, విద్యార్థులు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాలు, రంగులు, రసాయనాలు పూసిన విగ్రహాలను ఉపయోగించి వాటిని నదులు, కాలువలలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం విషతుల్యం అయి తద్వారా అనేక వ్యాధులు సంభవించి, అనేక జీవరాసులు, మానవులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి చక్కటి కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన కల్గించడం అభినందనీయమని క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, సభ్యులు కేదారశెట్టి సతీష్, జి. ప్రకాశరావు, ఎస్. జగదీష్, కూనిరెడ్డి శ్రీనివాసరావు, ఎన్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సమితి సభ్యులు సతీష్ రెడ్డికి, డాక్టర్ శ్రీనివాసరెడ్డికి, సిబ్బందికి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కళాశాలకు చెందిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులు వినూత్నంగా విత్తనాలను ప్రతిమలలో నిక్షిప్తం చేసిన వినాయక ప్రతిమలను విద్యార్థులకు, సిబ్బందికి అందజేశారు. ఈ ప్రతిమలను పూజ అనంతరం కాల్వలలో నిమజ్జనం చేయకుండా ఇంటిలో గల పెరటిలో ఒక గొయ్యి తీసి అందులో నీళ్లు పోసి నిమజ్జనం చేసినచో ఒక మొక్క నాటినవారము అవుతామని, తద్వారా పర్యావరణాన్ని పచ్చదనాన్ని పరిరక్షించే విధంగా వినూత్నంగా మట్టి ప్రతిమలను అందజేశారు. అగ్రికల్చర్ విభాగం విద్యార్థుల సామాజిక స్పృహకు ఆదిత్య వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు అభినందించారు. అలాగే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.







