* సర్వశిక్షా అభియాన్ పీవో విజయభాస్కర్
UPDATED 21st OCTOBER 2019 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : ఓర్పు, సహనంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు భోదించాలని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి బి. విజయభాస్కర్ అన్నారు. మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి అధ్యక్షత సోమవారం స్థానిక దుర్గాప్రసాద్ స్కూల్లో సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు ఆనందవేదిక శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవో విజయభాస్కర్ మాట్లాడుతూ పిల్లలకు మనం చేసే పని పట్ల గౌరవించడం నేర్పాలని, ప్రతీ విద్యార్థి కష్టపడకుండా ఇష్టపడి చదివేలా చూడాలన్నారు. మన హృదయం ఆనందంగా ఉంటే ఉపాధ్యాయులు చెప్పే ప్రతీ పాఠం విద్యార్థులు అర్థం చేసుకోగలరని అన్నారు. ప్రతీ రోజు పాఠశాలలో అరగంట పాటు ఆనంద వేదిక కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై ఆసక్తి ఏర్పడుతుందని అన్నారు. ఎంఈవో విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, అందులో చెప్పిన పాఠాలు నిర్వహణ తీరు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ స్ఫూర్తితో ప్రతీ పాఠశాలలో ఆనంద వేదిక కార్యక్రమం విజయవంతం చేసి తద్వారా మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు సిహెచ్ వెంకటేశ్వరరావు, నరేష్, శివయ్య, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







