* ఎంపిడివో అబ్బిరెడ్డి రమణారెడ్డి
UPDATED 10th SEPTEMBER 2020 THURSDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): మాతా శిశు సంరక్షణే లక్ష్యంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఎంపిడివో అబ్బిరెడ్డి రమణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీడీపీవో పంతం సావిత్రి అధ్యక్షతన గర్భిణీలు, బాలింతలకు వైఎస్ఆర్ పోషణ కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీడీవో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్య ప్రదేశ్ గా రూపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఒక వరం లాంటిదని అన్నారు. ఏ రాష్ట్రంలోను లేని విధంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.1800 కోట్లు కేటాయించిందని, ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారంతో రక్తహీనత దరిచేరదని తెలిపారు. పేద ప్రజలకు పౌష్టికాహార లోపం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా పోషక విలువలు తగ్గి అనారోగ్యానికి గురవుతున్న సందర్భంలో ఈ పథకం ద్వారా పోషక విలువలతో కూడిన రూ.900 విలువ గల ఆహారపు కిట్ ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీడీపీవో సావిత్రి మాట్లాడుతూ గర్భిణీ, బాలింతల ఆరోగ్యంతో పాటు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలు గల పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈపథకాన్ని ప్రారంభించిందని, నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలకు ప్రతీ నెలా రాగిపిండి, జొన్నలు, వేరుశెనగ, ఖర్జూరం, గోధుమ, అటుకులు, బెల్లం, అలాగే చిన్నారులకు ఆరు నెలల నుంచి కోడిగుడ్లు, పాలు, తదితర పదార్థాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పోషకాహార కిట్లను ఎంపీడీవో చేతులమీదుగా గర్భిణీలు, బాలింతలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, అంగన్వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.







