ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు భారత విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. ‘దౌత్యమార్గాల ద్వారా భారత్, పాకిస్థాన్ తమ అణు స్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 31వ సారి’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ‘ఎటాక్స్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్’ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఈ వివరాలను పరస్పరం అందజేసుకున్నాయి. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. ఏటా అణు స్థావరాల సమాచారం అందించుకోవాలని ఇందులోని ఆర్టికల్-2 నిబంధన స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.







