UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: దేశానికి దిశా నిర్ధేశం చేసే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించి బడుగు, బలహీన వర్గాల్లో వెలుగులు నింపారని మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన నూతన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి ప్రపంచం గర్వించే రాజ్యాంగాన్ని రచించాడని, ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రగతిపథంలో పయనించాలని అన్నారు. అణిచివేతకు గురవుతున్న వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీశాలి అంబేద్కర్ అని కొనియాడారు. అలాగే సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అని, భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులను తెయజేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందించిన ఈయన అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్, నేతల వెంకటలక్ష్మి, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, దవులూరి సుబ్బారావు, కె. ఐలయ్య, ఎం. శ్రీను, కాకర ప్రసాద్, దడాల సురేష్, శ్యామ్ దయాకర్, సత్తిరాజు వెంకటరావు, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు..







