UPDATED 24th JANUARY 2020 FRIDAY 6:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-కర్షక్ లో రైతులు తమ పొలంలో వేసిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి కొల్లి ద్వారకాదేవి పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని జి. రాగంపేట, వడ్లమూరు, పులిమేరు, గోరింట, దివిలి, తాటిపర్తి గ్రామాల్లో ఈ-కర్షక్ పథకంపై నాలెజ్డ్ ఆన్ వీల్స్(సంచార విజ్ఞాన వాహనం) ద్వారా రైతులకు అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం క్యాంపెనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో ద్వారకాదేవి మాట్లాడుతూ ఈ-కర్షక్ పథకంలో రైతులు తమ పొలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా రైతు భరోసా, పంట నష్టపరిహారం, వ్యవసాయ యాంత్రీకరణ, పంట ఋణాలు, కనీస మద్దతు ధర, ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే ప్రతిఫలాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతీ రైతు సర్వే నెంబర్, విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలను తమ గ్రామాల్లో గల వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బర్రే నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంస్థ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, రైతులు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ 18004198800 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రసాద్, రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది బచ్చల శ్రీనివాస్, ఎ. నరేష్, పి. శ్రీను, రైతులు, తదితరులు పాల్గొన్నారు.







