UPDATED 22nd SEPTEMBER 2017 FRIDAY 10:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. రెండవరోజు ఆశ్వయుజ శుద్ధ విదియ శుక్రవారం కావడంతో మహా మహిమాన్విత రూపమైన బాలాత్రిపురసుందరీదేవిని కొలిచేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. దీనిలోభాగంగా అమ్మవారికి సుప్రభాతసేవ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. లలితా అష్టోతర సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం, నీరాజన మంత్రపుష్పం, దర్బారుసేవ మొదలైన పూజాదికాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ప్రసంగిస్తూ బాలాత్రిపురసుందరీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్ ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులకు వివరించారు. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి.వి.బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి), ఎర్రాప్రగడ రామకృష్ణ, యోగి, గండికోట సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







