UPDATED 4th JULY 2020 SATURDAY 6:30 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, అందులో భాగంగా అంబులెన్సుల వ్యవస్థకు జీవం పోసి బలోపేతం చేసినట్లు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏకు సమకూర్చిన ఏడు 108 అత్యవసర వైద్య సేవల వాహనాలు, ఏడు 104 సంచార వైద్యశాలల వాహనాలను స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబి చైర్మన్ అనంత సత్య ఉదయ భాస్కర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రారంభించి నిర్దేశిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబి చైర్మన్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఈ నూతన అంబులెన్సులు ఏజెన్సీ ప్రాంతంలో ఫోన్ చేసిన 25 నిముషాలలో అందుబాటులోనికి వస్తాయన్నారు. అత్యవసర వైద్య సేవలకు తగినరీతిలో ఆధునీకరించిన 108, 104 అంబులెన్సు సర్వీసులు రావడం ఆరోగ్యపరంగా మంచి పరిణామమని, స్థానిక ఆరోగ్య కేంద్రాలకు అంబులెన్సు సర్వీసులను అనుసంధానం చేయడం మంచి ఆలోచనా విధానమని తెలిపారు. ఇకపై సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందుతాయనే భరోసా ప్రజలలో కలిగేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు, రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోందని క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ రికార్డులను పరిశీలించుకోవచ్చుని అన్నారు. ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఈ వాహనాలు సక్రమంగా వినియోగిస్తూ గిరిజనులకు ఆరోగ్య భద్రతను చేకూర్చాలన్నారు. కరోనా సంక్షోభంలో పొరాడుతున్న సమయంలో 108 అత్యవసర వైద్య సేవలు, 104 సంచార వైద్య శాలల అంబులెన్సులు పెద్దసంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితులలో ఉన్న రోగులకు, ప్రమాదాలు విపత్తులలో గ్రామీణ ప్రాంతాలలో ఈ తరహా అంబులెన్సు ఉపయోగం ఎంతగానో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ బి. వినోద్ కుమార్, ఎపిఓ పివిఎస్ నాయుడు, గోవింద బాబు, ప్రజా ప్రతినిధులు బాలకృష్ణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







