UPDATED 23rd APRIL 2018 MONDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహణకు గాను ఉత్తమ సంస్థగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఆదిత్య క్యాంపస్ లో గల ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, విద్యార్థులు గత తొమ్మిది సంవత్సరాలుగా సంవత్సరానికి రెండు పర్యాయాలు (జనవరి, ఆగష్టు/సెప్టెంబర్ నెలలు) ఒక్కొక్క పర్యాయం 2000 నుంచి 2500 మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ రక్తదానం చేసే విధంగా వారికి అవగాహన కల్పించి వివిధ బ్లడ్ బ్యాంకులకు అందిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థులు ఒక యాప్ ను రూపొందించి దాని ద్వారా కళాశాలలోని విద్యార్థుల బ్లడ్ గ్రూప్ వివరాలు సేకరించి అవసరమైన సందర్భంలో కావలసిన గ్రూప్ విద్యార్థులను సంప్రదించి అప్పటికప్పుడు రక్తం అందించే విధంగాను, ఆయా బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ బ్యాంకులలో సిద్ధంగా ఉందో తెలుసుకొనే విధంగా ఆ యాప్ ను తయారుచేసి అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం గర్వకారణమని, అందుకు కారకులైన విద్యార్థులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదిత్య కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.







