UPDATED 20th JULY 2018 FRIDAY 6:30 PM
గండేపల్లి: నిరంతరం శ్రమించే అధ్యాపకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ డిగ్రీ విద్యార్థులకు ఉపయోగపడేలా ఆపరేషన్స్ మేనేజ్ మెంట్ పై రచించిన పుస్తకం గుంటూరుకు చెందిన శ్రీ పబ్లిషింగ్ హౌస్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో విశేషమైన అనుభవం గల డాక్టర్ ఆస్ధాశర్మ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేరీతిలో గతంలో అనేక పుస్తకాలు రచించారని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పుకు, నవనిర్మాణ స్థాపనకు దేశాభివృద్ధిలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమని, డాక్టర్ ఆస్ధాశర్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అనేక సదస్సులు, ఉపన్యాసాల్లో పాల్గొని విశేష అనుభవం గడించారని అన్నారు. డాక్టర్ ఆస్ధాశర్మ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం ఆధునిక బోధనా పద్దతులపై అవగాహనా పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. గతంలో వ్యవస్థాపకత, సేవారంగానికి సంబంధించిన పుస్తకాలను రచించానని, వాటి ద్వారా విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని నిత్యజీవితంలో అన్వయించినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆస్ధాశర్మను అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.







