UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 7:30 PM
సామర్లకోట: వేమగిరి దళితులకు చెందిన భూముల్లో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ ను తక్షణం నిలిపివేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రొక్కం శ్యాందయాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వం పట్టా ఇచ్చినప్పటికీ నిరుపేద దళితులని చూడకుండా అక్కడ ఉన్న పేదల భూములను బలవంతంగా ఖాళీ చేయించి అక్రమంగా క్వారీయింగ్ చేస్తూ వాళ్లను నిరాశ్రయులుగా మారుస్తున్నారని ఆరోపించారు. అధికార ప్రభుత్వం పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఇక్కడ కొండపై వందల ఇళ్లు ఉండగా 160 అడుగుల లోతులో పక్కనే క్వారీ గోతులు ఉండడం చాలా దురదృష్టకరం అని అన్నారు. వర్షాకాలంలో ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉందని, ఎలక్ట్రికల్ పోల్స్ ఇష్టానుసారం ఉన్నాయని, దీనిపై రిపోర్టు ఇచ్చినప్పటికీ పోలీసులు, మైనింగ్ అధికారులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి పరిశీలించి దోషులను అరెస్టు చేయాలని చెప్పినా ఇంతవరకు ఏ విధమైన అరెస్టులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపి జి.వి హర్షకుమార్ కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ నెల 24న ఛలో వేమగిరి కార్యక్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేసి తద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ నేతల హరిబాబు, కుంచే జగన్, ఎన్. రాంప్రసాద్, జిల్లా యువజన అధ్యక్షులు వరపు వీరేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బోసు, దేవలోడ సరస్వతిరావు, తదితరులు పాల్గొన్నారు.







