UPDATED 16th MARCH 2019 SATURDAY 5:30 PM
పెద్దాపురం: ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని, దీనికిగాను అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి వసంతరాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో విలేఖరులతో శనివారం ఆయన మాట్లాడుతూ సెగ్మెంట్ కు సంబంధించి 20 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని, వీరు ప్రతీ పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారంతో పాటు, సంబంధిత పరిశీలనా నివేదికను సమర్పిస్తారని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రతీచోట కెమెరాతో నిఘా ఉంచడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ సరళి వీడియో ద్వారా చిత్రీకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 95 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని, వీటిపై ప్రత్యేక దృష్టి కనబరుస్తామని తెలిపారు. ఈనెల 18వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఆర్డీవో కార్యాలయంలో జరుగుతుందని, ఈ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలో అభ్యర్థులు ప్రవేశించడానికి నియమావళి ప్రకారం అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆర్డీవో కార్యాలయం ప్రహరి చుట్టూ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామని, గుర్తింపు కార్డు కలిగిన ప్రభుత్వ అధికారులు, అభ్యర్థులు మాత్రమే కార్యాలయంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఏ ఒక్కరూ విస్మరించరాదని, ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని ఆర్డీవో స్పష్టం చేశారు.







