UPDATED 16th OCTOBER 2018 TUESDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పనిచేస్తున్న అధ్యాపక సిబ్బందికి చెందిన 6-13 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులకు ఆదిత్య టెక్నికల్ హబ్ టెక్ బడ్స్ కార్నివెల్ పేరిట ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించినట్లు టెక్నికల్ హబ్ సిఇవో బాబ్జి నీలం తెలిపారు. చిన్నారులకు సాంకేతక పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆట, పాటలతో కూడిన వినూత్నకార్యక్రమం చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంది. పిల్లలలో సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ పెంచేందుకు సాల్ట్ వాటర్ కారును రూపొందించారు. అలాగే డ్రోన్ ఉపయోగాలు, స్క్రాచ్ ప్రోగ్రామింగ్, సుడోకు, టెక్నికల్ క్విజ్, ఎఆర్, విఆర్ టెక్నాలజీలను వినోదాత్మక రూపంలో పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిత్యలో తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం జరగడంతో విభాగాధిపతులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేసారు. ఉదయం 9-30 నుంచి సాయంత్రం 4-30 నిమిషాల వరకు జరిగిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో టెక్నికల్ హబ్ సిబ్బంది కృషి అభినందనీయమని బాబ్జి నీలం అన్నారు.







