మరిడమ్మ దేవస్థానంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు

* ఉద్యోగి సస్పెన్షన్ పై దేవస్థానం సిబ్బంది ఆందోళన 
* ఏసీని సస్పెండ్ చేయాలంటూ ఉద్యోగులు  డిమాండ్
* వైఎస్ఆర్సీపీ నాయకుల చొరవతో సద్దుమణిగిన వివాదం

UPDATED 26th OCTOBER 2020 MONDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అటెండరుగా పనిచేస్తున్న బి. సురేష్ కుమార్ ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేవస్థానం సిబ్బంది సోమవారం ఆందోళనకు  దిగారు. విధి నిర్వహణలో అలసత్వం, తదితర అభియోగాలపై తాత్కాలికంగా అతనిని విధుల నుంచి తప్పించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. దీంతో సదరు అటెండర్ సురేష్ కుమార్ తనకు అన్యాయం జరిగిందని భావించి దేవస్థానం ఎదుట ఆందోళనకు  దిగాడు. తనను అసిస్టెంట్ కమీషనర్ మానసికంగా వేధిస్తున్నారని, పైగా తనను తరచూ అకారణంగా నిందించడంతో పాటు తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న నెపంతో తనను విధుల నుంచి తప్పించారని ఆరోపించాడు. దీంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాయని, తనను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దేవస్థానం సిబ్బందితో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆ ఉద్యోగికి మద్దత్తు తెలియచేస్తూ అసిస్టెంట్ కమీషనర్ పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో దేవస్థానం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, త్సలికి సత్యభాస్కర్ తదితరులు దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, అసిస్టెంట్ కమీషనర్ విజయలక్ష్మితో చర్చలు జరిపారు. సదరు ఉద్యోగిని నిబంధనల మేరకు విధుల్లోకి తీసుకునేందుకు వారు అంగీకరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయంపై దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ విజయలక్ష్మిని వివరణ కోరగా సురేష్ కుమార్ గత కొన్ని రోజులుగా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, పైగా ప్రసాదం కౌంటర్లలో డబ్బులు కాజేయడం, అలాగే దేవస్థానం సమీపంలో ఉన్న దుకాణాల యజమానుల  నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాగే గతం నుంచి పలు ఫిర్యాధులు వస్తున్న నేపథ్యంలో అతనికి షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశామన్నారు. అయినా సరే అతని వైఖరిలో మార్పు రాని కారణంగా సదరు వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు ఆమె తెలిపారు.  
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us