UPDATED 12th APRIL 2018 THURSDAY 6:00 PM
పెద్దాపురం: ఏప్రిల్ 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అతిరాత్ర సోమయాగాన్ని విజయవంతం చేయాలని యాగ పర్యవేక్షణ కర్త బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ కోరారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక పాండవుల మెట్ట వద్ద నిర్వహిస్తున్న అతిరాత్ర సోమయాగం ఏర్పాట్లును పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, డి.ఎస్.పి చిలకా వెంకట రామారావు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావు, డిప్యూటి డి.ఎం.హెచ్.వో ప్రసన్నకుమార్, ఆర్.డబ్ల్యు.ఎస్ డిఇ కుమార్, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, సర్కిల్ ఇనస్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్, సబ్ ఇనస్పెక్టర్ ఎ. కృష్ణభగవాన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది ప్రసాద్ గురువారం పరిశీలించారు. పోలీస్ బందోబస్త్, బారికేడ్లు ఏర్పాట్లు, మెడికల్ క్యాంప్స్, టాయిలెట్స్, త్రాగునీరు, శానిటేషన్, విఐపి గ్యాలరీ, భక్తుల క్యూలైన్లు, ఉచిత అన్నదాన స్థలం, తదితర అంశాలపై అధికారులు యాగ పర్యవేక్షణకర్త హరిహరనాథ శర్మను అడిగి తెలుసుకుని, శాఖాపరంగా వారికి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అతిరాత్ర యాగ పర్యవేక్షణకర్త హరిహరనాథశర్మ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు అతిరాత్ర సోమయాగం, 26వ తేదీన పుత్రికామేష్టి, 27న ప్రత్యంగిరి హోమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గతంలో భద్రాచలం, కర్నూలు, మురమళ్ళలో నిర్వహించిన యాగాల అంచనా ప్రకారం సుమారు ఎనిమిది లక్షల మంది భక్తులు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్చంద సేవా సంస్థలు, భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.







