UPDATED 9th AUGUST 2017 WEDNESDAY 6:00 PM
సామర్లకోట: భక్తులు ఆరాధించే శిధిలావస్థలో ఉన్న ప్రాచీన దేవాలయాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో మారెమ్మ , శ్యామలాంబ దేవాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 250 సంవత్సరాల చరిత్ర గల మారెమ్మ, శ్యామలాంబ గ్రామ దేవతలు సుమారు 40 సంవత్సరాల నుంచి విగ్రహాలు శిధిలావస్థలో ఉన్నాయని అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ దేవాలయాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి భక్తుల కోరికను తీర్చాలనే సంకల్పంతో రూ. 40 లక్షలు వ్యయంతో అమ్మవారి దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. గ్రామంలో రోడ్లు, రైల్ వే లైన్ సమస్యలను పరిష్కరించామని, ఎమ్మెల్యే గ్రాంట్ రూ.15 లక్షలుతో డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తున్నామని, అలాగే అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి గృహాలను నిర్మిస్తామన్నారు. కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించడంలోముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే బిసిల్లోకి చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, సర్పంచ్ దడాల నాగరాజు, ఉప సర్పంచ్ తోటకూర వెంకటేశ్వరావు, ఎంపిటిసిలు మారిన వీరభద్రరావు, శ్రీను, తోటకూర శ్రీనివాస్, గుమ్మళ్ల రామకృష్ణ, వల్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







