ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు
Updated 28th April 2023 Friday 7:10 AM
Scientist Dr. Challa Venkata Narasimharao: దాళ్వా సాగు చేసిన వరి పొలాల్లో నూక శాతం ఎక్కువగా వస్తోందన్న సమాచారం మేరకు నూక శాతాన్ని తగ్గించేందుకు కాకినాడ జిల్లా (Kakinada District) ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు శుక్రవారం పలు సూచనలు చేశారు.
గోదావరి మండలంలో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈపంటను సుమారు 2.75 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగు చేస్తున్నారు. దాళ్వాలోసాగు చేసే రకాలలో యం.టి.యు - 1121, యం.టి.యు 116, యం.టి.యు 3626, ఎస్.ఎల్ - 10, పి.ఆర్ 126 రకాలు ఎక్కువగా చేయబడుతున్నాయి. రబీ కాలంలో రైతాంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య మిల్లింగ్ లో గింజ విరిగిపోయి నూక ఎక్కువగా రావడం వల్ల కొనుగోలు ధర తగ్గి బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకోవడం, తద్వారా నికరాదాయం తగ్గిపోవడం గమనిస్తున్నాము. ప్రస్తుత రబీ కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది.
నూక ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు :
పూత సమయం తరువాత కూడాపైపాటుగా నత్రజని ఎరువులు వేయడం. పంట పక్వానికి వచ్చినా కూడా చేనుపైనే ఎండిపోవాలనే ఉద్దేశ్యంతో కోతను ఆలస్యం చేయడం వలన పంట ఎక్కువగా ఎండిపోయి గింజపై పగుళ్ళు రావడం. కోత కోసం చేను ఆరగట్టడానికి క్రమక్రమంగా కాకుండా ఒకేసారి నీటిని తగ్గించివేయడం. చౌడు నేలల్లో సాగుచేసిన వరి పంట కూడా నూక శాతం ఎక్కువగా రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చును. దోమపోటు ఎక్కువగా ఆశించడం వల్ల గింజ పూర్తిగా తోడుకోక నూక శాతం ఎక్కువ వస్తుంది. పంటను బాక్టీరియా ఆకు ఎండు తెగులు, పొడ తెగులు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు వంటి తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం వల్ల గింజలు పూర్తిగా తోడుకోక నూక శాతం ఎక్కువ వస్తుంది. కీలక దశలలో పంట నీటి ఎద్దడికి గురికావడం వల్ల కింద గింజలు పూర్తిగా తోడుకోక, నూక ఎక్కువగా వస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ధాన్యాన్ని కల్లంలో ఎక్కువ రోజులు ఆరబెట్టడం వల్ల గింజలలో తేమ ఒకేసారి తగ్గి, గింజలపై పగుళ్ళు వస్తాయి, తద్వారా నూక శాతం ఎక్కువ వస్తుంది. పంట పక్వ దశలో వర్షాలకు గురికావడం వలన కూడా నూక శాతం పెరుగుతుంది.
మిల్లింగ్ లో నూక శాతం తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు :
చిరు పొట్ట తరువాత ఎటువంటి నత్రజని ఎరువులు వేయరాదు. వెన్నులో 80 నుంచి 90 శాతం గింజలు పసుపురంగుకు మారుతున్నప్పుడు పంటను కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు చేనుపై ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చిన తరువాత ఎక్కువకాలం చేనుమీద ఉంటే దిగుబడి తగ్గడంతోపాటు గింజలపై పగుళ్ళు ఏర్పడతాయి. పొలాన్ని కోతకు ఏడు నుంచి రోజుల ముందు మాత్రమే క్రమేపీ నీటిని తగ్గించాలి. ఒకేసారి నీటిని కట్టేయకూడడు. దోమపోటు, పొడ తెగులు, అగ్గితెగులు, బాక్టీరియా ఆకు ఎండు వంటి తెగుళ్ళను సకాలంలో అరికట్టడం వల్ల మిల్లింగ్ లో నూక శాతం తగ్గించవచ్చును. మనుషులతో కోత కోసేటప్పుడు, పంట కోసిన తరువాత పనల మీద గింజలు కొంతవరకు ఎండుతాయి. అయితే ధాన్యంలో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీనికోసం సాధారణమైన ఎండలో ధాన్యాన్ని పరచి మధ్యమధ్యలో తిరగదిప్పాలి. తూర్పారబట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ 12 శాతం వచ్చేవరకు తగ్గించాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టినట్లయితే గింజలలో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్ళు వస్తాయి. తేమ శాతం తగ్గాలనే ఉద్దేశ్యంతో ఆలస్యంగా కోయడం, వేగంగా ఆరతాయనే ఉద్దేశ్యంతో అధిక ఉష్ణోగ్రత వద్ద ఆరబెడితే ధాన్యం మిల్లింగ్ లో నూక ఎక్కువయ్యే అవకాశం ఉంది. రబీ పంట ఏప్రిల్ 15 లోపల కోతకు వచ్చే విధంగా అంటే జనవరి 15 లోపల నాట్లు వేయడం పూర్తిచేయాలి.







