UPDATED 14th JULY 2019 SUNDAY 8:00 PM
పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టిందని ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నాల్గవ రోజైన ఆదివారం జె.తిమ్మాపురం, కొండపల్లి, వడ్లమూరు గ్రామాల నుంచి హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవలందించేందుకు గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. గతంలో ప్రభుత్వ పథకాల వివరాలు పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోల ద్వారా ప్రజలకు చేరేవని, అవి సక్రమంగా ప్రజల వద్దకు వెళ్లకపోవటంతో నూతన ప్రభుత్వం ప్రతీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరును నియమించనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, ఎంఏవో కొల్లి ద్వారకాదేవి, ఎంపీడీవో కార్యాలయం సూపరెంటెండెంట్ విప్పర్తి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.







