UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులను ప్రయోజకులుగా, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. స్థానిక సీబీఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవన్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఇవోలు వై.వి. శివరామకృష్ణయ్య (బిక్కవోలు), పులపకూర జాన్ హాజరై మాట్లాడారు. సిబిఎం పాఠశాల అభివృద్ధికి జీవన్ కుమార్ విశేష కృషి చేశారని, పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతున్న సమయంలో పూర్వ విద్యార్థులను ఐక్యం చేసి స్థలాన్ని ఆక్రమణల నుంచి పరిరక్షించారని అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణా తరగతులు ఈ పాఠశాలలో తరచూ నిర్వహించేవారంటే ఆ పాఠశాల అభివృద్ధిని మనం అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా జీవన్ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పరిధిలో గల ఉపాధ్యాయులు, పాస్టర్లు, ప్రతిభా విద్యానికేతన్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







